• 7 years ago
Madiga Reservation Porata Samithi (MRPS) leader Manda Krishna Madiga blamed Telangana CM K Chandra sekhar Rao (KCR) on the categorisation of SC reservations.


తెలంగాణ రాష్ట్రంలో దొరలకు ఒక న్యాయం, దళితులకు మరో న్యాయమా? అని ఎమ్మార్పీయెస్ వ్యవస్థాపక నేత మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే 20 కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తారా? అని అడిగారు. తెలంగాణ ఉద్యమంలో ట్యాంక్‌బండ్‌ మీద విగ్రహాలు ధ్వంసం చేయలేదా? ఆందోళనలు చేపట్టలేదా? అని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ నెల 10న సికింద్రాబాద్‌లో భారతి సంస్మరణ సభ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కొద్దిపాటి హింసాత్మక సంఘటనలు జరిగాయి. దాంతో పోలీసులు మందకృష్ణతో పాటు కొందరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. బుధవారం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

ఎస్సీరిజర్వేషన్ల వర్గీకరణను అడ్డుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఎంత అణచివేయాలని చూస్తే ఉద్యమాన్ని అంత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వర్గీకరణ కోసం సీఎం కేసీఆర్‌ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. జనవరి 1నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉపవాస దీక్షలు చేపట్టనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో ఎక్కడ అనుమతిస్తే అక్కడే దీక్షలు చేపడుతామని చెప్పారు. దీక్షలను అడ్డుకోవాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ఎమ్మార్పీఎస్‌ అండగా నిలిచిందని, తెలంగాణకు మద్దతుగా ఎమ్మార్పీఎస్‌ టీఆర్‌ఎస్‌కు లేఖ అందజేసిన విషయాన్ని మంద కృష్ణ చెప్పారు.

Category

🗞
News

Recommended