• 7 years ago
Municipal Chair Person Husband Boddupalli Srinivas lost life in Nalgonda on Wednesday night.

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరుడు, నల్గొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం సావర్కర్ నగర్ లోని ఆయన ఇంటి వద్ద గుర్తు తెలియని దుండగులు బండ రాయితో మోది ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మురుగు కాల్వలో మృతదేహం పడి ఉండ‌టాన్ని గుర్తించిన కొంద‌రు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు. స్థానికులు చెప్పిన కథనం ప్రకారం.. శ్రీనివాస్ నివాసం ఉంటున్న సావర్కర్ నగర్‌లో రాత్రి 11గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గొడవపడ్డారు. ఈ విషయంలో స్థానిక కౌన్సిలర్ కుమారుడు మెరగు గోపి సర్ధిచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
అయినా గొడవ సద్దుమనగకపోవడంతో గోపీ.. శ్రీనివాస్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో బయటకు వచ్చిన శ్రీనివాస్ వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. అయతే, ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటమాట పెరగడంతో శ్రీనివాస్‌ను హత్య చేసి మురికి కాలువలో పడేసినట్లు భావిస్తున్నారు.
హత్య అనంతరం నిందితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. శ్రీనివాస్ హత్య నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. సమాచారం అందుకున్న ఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
అయితే, హంతకులు ముందుగా ప్లాన్ ప్రకారమే వచ్చి శ్రీనివాస్‌ను హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, విషయం తెలుసుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి నల్గొండకు చేరుకుని శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. కొంత ఉద్వేగానికి లోనైన కోమటిరెడ్డి కంటతడి పెట్టుకున్నారు.

Category

🗞
News

Recommended