• 8 years ago
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగస్థలం' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 1985 నాటి పరిస్థితులతో పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రామ్ చరణ్ కోరీర్లోనే ఒక డిఫరెంట్ చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. మార్చి చివరి వారంలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లహరి మ్యూజిక్ వారు ఆడియో రైట్స్ భారీ రేటుకు దక్కించుకున్నారు. ఇది టాలీవుడ్లో 4వ బిగ్గెస్ట్ ఆడియో డీల్‌ అని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.
డీఎస్పీ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రైట్స్ లహరి మ్యూజిక్ వారు రూ. 1.60 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా కంటే ముందు మరో మూడు సినిమాలు ముందున్నాయి.
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరెక్కుతున్న ‘భరత్ అను నేను' సినిమా ఆడియో రైట్స్ రూ. 2 కోట్ల పైచిలుకు మొత్తానికి అమ్ముడుపోయింది. ఈ చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం విశేషం.
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అజ్ఞాతవాసి'. ఈ చిత్రానిక అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో రైట్స్ రూ. 2 కోట్లకు అమ్ముడు పోయాయి.
మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్పైడర్' చిత్రం ఆడియో రైట్స్ అప్పట్లో తెలుగు, తమిళంలో కలిపి రూ. 2 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందించారు.

Recommended