• 7 years ago
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దారితీసేలా ఉత్తరాంధ్ర సమస్యలు ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మేధావులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై పలువురు మేధావులు ప్రసంగించారు. ప్రొఫెసర్ కేఎస్ చలం, ప్రొఫెసర్ కేవీ రమణ, ప్రజా గాయకుడు వంగపండు, వామపక్ష ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం పవన్ మాట్లాడారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ రాకముందే అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానని వెల్లడించారు. ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లిన వారికి ఎకరా భూమి చొప్పున కొనిస్తానని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల బాధలను తెలుసుకునేందుకే తాను ఉత్తరాంధ్రలో పర్యటించానని చెప్పారు.
తన ఉత్తరాంధ్ర పర్యటనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్రేకంగా ఉన్నారని పవన్ ఎద్దేవా చేశారు. తాను ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన భావిస్తున్నారని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉధ్యమ స్ఫూర్తి ఉందని, వారిని రెచ్చగొట్టాల్సిన అవసరం తనకు లేదన్నారు. ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి ఉన్నప్పటికీ నాయకుల్లో మాత్రం లేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ చెప్పారు. స్థానికంగా న్యాయం చేసే వారికే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తానని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భూములు కబ్జా చేస్తారని టీడీపీ ప్రచారం చేసిందని, కానీ టీడీపీ వాళ్లే లక్షల ఎకరాలు కబ్జా చేయడం దారుణమని వాపోయారు.

Category

🗞
News

Recommended